
చెన్నై: ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మే 17న లేఖలు రాశారు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ఎంకే స్టాలిన్ గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 13న రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించడాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కోర్టు నిర్ణయాన్ని లెక్కచేయకుండా గవర్నర్ అధికారాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా కోర్టును ఆశ్రయించడం వారి దుష్ట ఉద్దేశాన్ని సూచిస్తున్నదని ఆరోపించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను వ్యతిరేకించాలని బీజేపీయేర రాష్ట్రాల ప్రభుత్వాలను డీఎంకే అధ్యక్షుడైన ఎంకే స్టాలిన్ కోరారు. ‘మన సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో (తమిళనాడు రాష్ట్రం vs తమిళనాడు గవర్నర్) సమర్థించిన విధంగా, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించడానికి, సంరక్షించడానికి మనం కోర్టు ముందు సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలి. ఐక్య ఫ్రంట్‌ను ప్రదర్శించాలి. ఈ కీలకమైన విషయంలో మీ తక్షణ, వ్యక్తిగత జోక్యం కోసం నేను ఎదురు చూస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, పంజాబ్, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖలు రాశారు.