IPL 2025 | జురెల్ పోరాడినా.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే పైచేయి

Pbks Won

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) నాకౌట్ ద‌శ‌కు మ‌రింత చేరువైంది. ఆదివారం జైపూర్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది. నేహ‌ల్ వ‌ధేరా(70), శ‌శాంక్ సింగ్(59 నాటౌట్) మెరుపుల‌తో కొండంత స్కోర్ చేసిన పంజాబ్..అనంత‌రం ఆల్‌రౌండ్ షోతో ప్ర‌త్య‌ర్థిని 209కే క‌ట్ట‌డి చేసింది. ధ్రువ్ జురెల్(53) ఒంట‌రి పోరాటం చేసినా.. కీల‌క వికెట్లు తీసిన‌ హ‌ర్‌ప్రీత్ బ్రార్(3-22) రాజ‌స్థాన్ న‌డ్డివిరిచాడు. దాంతో, పంజాబ్ 10 ప‌రుగుల తేడాతో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఇప్ప‌టికే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన సంజూ సేనమ‌రో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బ‌రిలో నిలిచింది. ఆదివారం జ‌రిగిన డబుల్ హెడ‌ర్ తొలి పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ఉత్కంఠ విజ‌యంతో టేబుల్‌లో రెండో స్థానానికి ఎగ‌బాకింది. తొలుత నేహ‌ల్ వ‌ధేరా(70), శ‌శాంక్ సింగ్ (నాటౌట్) దంచికొట్ట‌గా.. హ‌ర్‌ప్రీత్ బ్రార్(3-22) రాజ‌స్థాన్ న‌డ్డివిరిచాడు. పేస్ బౌలింగ్ యూనిట్ స‌మిష్టిగా రాణించ‌గా..సంజూ సేన ఓట‌మి పాలైంది. జురెల్(53) మిన‌హా టెయిలెండ‌ర్లు విఫ‌లం కావ‌డంతో, పంజాబ్ 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 220 ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌మ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో య‌శ‌స్వీ జైస్వాల్(50 నాటౌట్).. ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 22 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఆ త‌ర్వాత మార్కో యాన్సెన్ ఓవర్లో వైభవ్ సూర్య‌వంశీ(40) త‌న ప్ర‌తాపం చూపించి 6, 4, 6 బాదగా 17 ర‌న్స్ వ‌చ్చాయి. ఈ ఇద్ద‌రు లెఫ్ట్ హ్యాండ‌ర్ల విధ్వంసంతో రాజ‌స్థాన్ స్కోర్ 3 ఓవ‌ర్ల‌కు స్కోర్ 50 దాటింది.

వైభవ్ సూర్య‌వంశీ(40)

Viabhav

ఈ జోడీని విడ‌దీసేందుకు స్పిన్న‌ర్ హ‌ర్‌ప్రీత్ బ్రార్‌ను రంగంలోకి దింపిన అయ్య‌ర్ ఫ‌లితం సాధించాడు. వైభ‌వ్.. పెద్ద షాట్ ఆడ‌బోయి యాన్సెన్ చేతికి చిక్కాడు. దాంతో, 76 వ‌ద్ద రాజ‌స్థాన్ తొలి వికెట్ ప‌డింది. అయినా స‌రే య‌శ‌స్వీ జోరు త‌గ్గించ‌క‌పోవ‌డంతో రాజ‌స్థాన్ ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది. కానీ, హ‌ర్‌ప్రీత్ అర్థ శ‌తకంతో జోరుమీదున్న య‌శ‌స్వీని ఔట్ చేసి పంజాగ్‌కు మ‌రో బ్రేకిచ్చాడు.

జురెల్ ఒంట‌రి పోరాటం

ఆ కాసేప‌టికే అజ్మ‌తుల్లా బౌలింగ్‌ను సంజూ శాంస‌న్(20) ను ఔట్ చేసి రాజ‌స్థాన్ గెలుపు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. నాలుగో వికెట్‌కు 30 ర‌న్స్ జోడించిన రియాన్ ప‌రాగ్‌(13)ను ఔట్ చేసిన బ్రార్.. మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అప్ప‌టికీ సాధించాల్సిన ర‌న్‌రేట్ 14కు చేరింది. ధ్రువ్ జురెల్(53), షిమ్ర‌న్ హెట్‌మైర్ (11)లు..గెలిపించే బాధ్య‌త తీసుకున్నా పంజాబ్ బౌలర్లు అవ‌కాశం ఇవ్వేలేదు. అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవ‌ర్లో జురెల్ సిక్స‌ర్ బాద‌గా పంజాబ్ స్కోర్ 170 దాటింది. దాంతో, స‌మీక‌ర‌ణం 18 బంతుల్లో 41కి చేరింది.


అయితే.. హెట్‌మైర్ ఔట్ అయ్యాడు. కానీ, ఒంట‌రి పోరాటం చేసిన జురెల్ 18వ ఓవ‌ర్లో సిక్స‌ర్ బాద‌గా.. 12 బంతుల్లో 15 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే.. అర్ష్‌దీప్ 8 ర‌న్స్ మాత్ర‌మే ఇవ్వ‌గా.. 20వ ఓవ‌ర్లో జురెల్, హ‌స‌రంగ వ‌రుస బంతుల్లో ఔట్ అయ్యారు. దాంతో, పంజాబ్ 10 ప‌రుగుల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

వ‌ధేరా, శ‌శాంక్ విధ్వంసం

తొలుత‌ ఆడిన‌ పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం ద‌క్క‌క‌పోయినా.. యువ‌కెర‌టం నేహ‌ల్ వ‌ధేరా(70) అర్ధ శ‌త‌కంతో రెచ్చిపోయాడు. ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు ప‌డినా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్(30)తో కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. దేశ్‌పాండే విజృంభ‌ణ‌తో 34కే మూడు కీల‌క వికెట్లు ప‌డిన పంజాబ్‌ను అయ్య‌ర్, నేహ‌ల్ వ‌ధేరా (70)లు ఆదుకున్నారు. క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచిన ఇద్ద‌రూ బౌండ‌రీల‌తో హ‌డలెత్తించారు. దాంతో, 10 ఓవ‌ర్లకు పంజాబ్ స్కోర్ 97కు చేరింది. అయితే.. దంచికొడుతున్న అయ్య‌ర్‌.. రియాన్ ప‌రాగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వ‌త గేర్ మార్చిన వ‌ధేరా.. ఆకాశ్ మ‌ధ్వాల్ బౌలింగ్‌లో రెండో ఫోర్లతో అర్ధ శ‌త‌కం సాధించాడు.

నేహ‌ల్ వ‌ధేరా (70), శ‌శాంక్ సింగ్(59 నాటౌట్)

Punjab

ప్ర‌మాద‌క‌రంగా మారిన వ‌ధేరాను ఆకాశ్ ఔట్ చేయ‌గా రాజ‌స్థాన్ బౌల‌ర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ త‌ర్వాత అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జాయ్(21 నాటౌట్), శ‌శాంక్ సింగ్(59 నాటౌట్)లు ధ‌నాధ‌న్ ఆడారు. మ‌ఫాకా వేసిన 18 ఓవ‌ర్లో అజ్మతుల్లా రెచ్చిపోయాడు. 4, 6, 4 బాది 16 ప‌రుగులు పిండుకున్నాడు. అనంత‌రం ఆకాశ్‌కు చుక్క‌లు చూపిస్తూ బౌండ‌రీ బాదాడు అజ్మ‌తుల్లా. 20 ఓవ‌ర్లో 6, 4 తో క‌లిపి 17 ర‌న్స్ రావ‌డంతో పంజాబ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 219 ర‌న్స్ చేసింది.

Leave a Comment