
Saifullah Khalid | న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సైఫుల్లా ఖలీద్‌ను మట్టుబెట్టినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
ఇండియాలో జరిగిన మూడు ఉగ్రదాడుల్లో సైఫుల్లా ఖలీద్ కీలకంగా వ్యవహరించాడు. 2001లో రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేశాడు. బెంగళూరులో 2005లో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో దాడులకు పాల్పడ్డాడు. 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడడంలో కీలకంగా వ్యవహరించాడు సైఫుల్లా ఖలీద్. ఐదేండ్ల వ్యవధిలోనే జరిగిన ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఖలీద్ నేపాల్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ వినోద్ కుమార్ పేరుతో తప్పుదు ధృవపత్రాలు సృష్టించి, స్థానిక మహిళ నగ్మా బానును వివాహం చేసుకున్నాడు. లష్కరే తోయిబా కార్యకలాపాలను నేపాల్ నుంచే ఖలీద్ సమన్వయం చేసినట్లు సమాచారం.
ఇటీవల ఖలీద్ తన స్థావరాన్ని పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ బాదిన్ జిల్లాలోని మట్లీకి మార్చాడు. లష్కరే తోయిబాతో పాటు దాని ప్రధాన సంస్థ జమాద్-ఉద్-దవా కోసం ఖలీద్ పని చేస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు నియామకాలు, నిధుల సేకరణపై సైఫుల్లా దృష్టి సారించాడు.