70 ఏళ్లు దాటితే ₹5 లక్షల ఉచిత బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి?
AB-PMJAY | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న పథకాన్ని పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద ఏడు పదులు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇంతకీ ఈ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి? ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి?
ఎవరు అర్హులు..?
భారత్‌లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకం కింద అర్హులే. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ పథకం కింద వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరుంటే తలా రూ.2.50 లక్షల వైద్య సాయం పొందొచ్చు. ఇందులో మూడు రోజులపాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు తదితర సేవలు పొందొచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి.
ఎలా చేరాలి? ఏమేం కావాలి?
ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేరాల్సిన వారు ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా చేరొచ్చు. ముందు www.beneficiary.nha.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మీ రాష్ట్రం ఎంచుకున్నాక అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకుంటే.. ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఇదివరకే కేవైసీ పూర్తయ్యి ఉంటే.. నేరుగా ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వృద్ధుల తరఫున వారి కుటుంబ సభ్యులు సైతం వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఈ ప్రక్రియ చేయొచ్చు. లేదా ఎంప్యానెల్డ్ ఆస్పత్రికి వెళ్లి కూడా నమోదు చేయించొచ్చు.
క్యూలైన్లలో నిల్చొని నిల్చొని పుట్టుకొచ్చిన ఆలోచనే.. జొమాటో!
ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల జాబితా తెలుసుకోవడం ఎలా?
ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు 30 వేల ఆస్పత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల జాబితా dashboard.pmjay.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా ఎంచుకుంటే ఆస్పత్రి వివరాలు కనిపిస్తాయి.
ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి?
ఈ పథకం కింద 70 ఏళ్లు వయసు దాటిన వారికి ఆస్పత్రులు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం చెబుతోంది. చికిత్స విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ ఫిర్యాదులు ఉంటే.. పైన పేర్కొన్న వెబ్‌సైట్, యాప్‌లో గానీ లేదా నేషనల్ కాల్ సెంటర్ 14555ను సంప్రదించొచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యను పరిష్కారం లభిస్తుంది.
ఇతర హెల్త్‌స్కీముల్లో ఉన్న వారి మాటేంటి?
సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు.. వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని (AB-PMJAY) గానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు మాత్రం ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.