Illegal constructions | అధికార పార్టీ నేత పేరుతో.. ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు.. !

Illegal Constructions

Illegal constructions | దుండిగల్, మే 18: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా, ఇదేంటని ప్రశ్నించినా నియోజకవర్గంలోని ఓ ముఖ్య నేత పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజాంపేట కార్పొరేషన్, 18వ డివిజన్ పరిధి, సాయి అనురాగ్ కాలనీలో ఇటీవల పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ నుంచి జి+2 అంతస్తులు నిర్మాణానికి అనుమతులు పొంది ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. వీటివల్ల భవిష్యత్తులో మౌళిక వసతుల కల్పన సమస్య తలెత్తే అవకాశం ఉందని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటున్నారు. అయితే అక్రమాలను నియంత్రించేందుకు వెళ్లే అధికారులపై అధికార పార్టీకి చెందిన నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

సాయి అనురాగ్ కాలనీ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి ఇప్పటికే జి +2 అంతస్తులు ఉన్న పాత భవనంపై ఇటీవల మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నాడు. అయితే భవనం పిల్లర్ల సామర్థ్యంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. భవన యజమాని సైతం ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని, తమకు నియోజకవర్గం ప్రతినిధి ఒకరు బంధువు అని, అయినా మా పార్టీ అధికారంలో ఉన్నదని, మేము కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలా…? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భవన నిర్మాణ విషయమై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూసేందుకు జంకుతుండడం విశేషం. ఇప్పటికైనా అనుమతులు లేకుండా పరిమితులకు మించి చేపడుతున్న నిర్మాణాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు పనిచేస్తారా లేదా అని పలువురు ఎదురుచూస్తున్నారు.

 

Leave a Comment