Shayna Sunsara | తిరంగా యాత్రలో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషి కవల సోదరి.. Video

Sofia Sunsara

Shayna Sunsara : పాకిస్థాన్‌ (Pakistan) లోని, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ సింధూర్‌ (Operation Sindoor) కు మద్దతుగా దేశవ్యాప్తంగా జనం తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌ (Gujarat) లో జరిగిన తిరంగా యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషి (Sofia Khureshi) కవల సోదరి (Twin sister) షయ్‌నా సన్‌సారా (Shayna Sunsara) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్య అభినందనీయమని వ్యాఖ్యానించారు. మన రక్షణ వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఈ విషయం ప్రపంచం అంతటికీ తెలుసని ఆమె అన్నారు. భారత సైన్యం పరాక్రమం చాలా గొప్పదని, ఏదైనా లక్ష్యంగా పెట్టుకుంటే ఆ లక్ష్యం నెరవేరే దాకా విడిచిపెట్టదని చెప్పారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన నరమేథానికి ప్రతీకారంగా భారత్‌ మే నెల 7 నుంచి రెండు రోజులపాటు ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాక ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా ముగిసిపోలేదని, కొనసాగుతుందని ప్రకటించింది. ఈ క్రమంలో ఆపరేషన్‌ సింధూర్‌కు మద్దతుగా దేశంలో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నారు.

కాగా సోఫియా ఖురేషి సైనికాధికారిణిగా దేశం కోసం పోరాడుతుండగా.. ఆమె కవల సోదరి షయ్‌నా సన్‌సారా కూడా పలు రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆర్థికవేత్తగా, పర్యావరణవేత్తగా, జాతీయ స్థాయి షూటర్‌గా, బ్యూటీ క్వీన్‌గా రాణిస్తున్నారు.

Leave a Comment