
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్( Nagarkurnul ) జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) , రాష్ట్ర మంత్రులు సోమవారం పర్యటించనున్నారు. ఇందిరా సౌరగిరి జలవికాస పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు , ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజా ప్రతినిధులు గ్రామానికి వస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించారు.
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గిరిజనుల సంక్షేమానికి చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించి , ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన , మాచారంలో సీతా రామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుంటారని వివరించారు. మాచారంలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని , సభ పూర్తయిన అనంతరం సీఎం స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వెళ్తారని తెలిపారు.
అక్కడ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో తమ విధులు నిర్వర్తిస్తూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు.