అల్ప జీవులపై అధికారుల ఆధిపత్యధోరణి తగదు….
అరకొర జీతం తో అష్ట కష్టాలు పడుతున్న కాంట్రాక్ట్ ఏఈఓ లు…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పంట సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులకు ఏఈఓ లకు మధ్యన చిలికి చిలికి పెద్ద గాలి వాన లా ముదురుతుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో డిజిటల్ అగ్రి మిషన్ లో భాగంగా ఆయా రాష్ట్రాలలో సాగులో ఉన్న భూమిలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ప్రతి ఒక గుంట భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఫోటోలు తీయడం ద్వారా ఆయా పంటల వివరాలను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి తదనుగుణంగా ఈ సర్వే చేపట్టుటలో పాటించాల్సిన విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందించి ఈ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ పెంపొందించి వారికి తాత్కాలిక ఉపాధి కల్పన చూపించాలనే సదుద్దేశంతో ప్రతి 1,000 ఎకరాలకు ఒకరి చొప్పున లోకల్ యూత్ మరియు కృషి సఖి ల పేర్లతో తాత్కాలిక ప్రాతిపదికన నిరుద్యోగ యువత ను అపాయింట్ చేసి వారి ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి గుంట భూమిని 100% అక్యురసి తో సర్వే చేపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పంట సర్వే మార్గదర్శకాలకు రూపొందించింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర 11 రాష్ట్రాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి 1,000 ఎకరాలకు ఒక నిరుద్యోగ యువతను తాత్కాలిక ప్రాతిపదిక నియమించుకొని వారితో క్షేత్రస్థాయిలో పంటల సర్వేను పకడ్బందీగా చేపిస్తున్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఒక కోటి 50 లక్షల ఎకరాల సాగు భూములను సర్వే చేపించడానికి సుమారుగా 15,000 మంది సిబ్బంది అవసరం అవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖలో అందుబాటులో ఉన్న కేవలం 2,600 మంది ఏఈఓ లతోనే సుమారుగా 15,000 మంది చేయాల్సిన పనిని చేపించాలనే ప్రయత్నాలు చేయడం వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు మధ్యన తీవ్రమైన అఘాతాన్ని సృష్టిస్తుంది. 8 నుండి 10 మంది చేయాల్సిన పనిని కేవలం ఒక్క AEO తోనే చేయించాలని చూడటం వల్ల AEO ల పై తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగిస్తుందని ఏఈవోలు వాపోతున్నారు. రాష్ట్రంలో 2,606 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ప్రస్తుతం 2,300 మంది మాత్రమే రెగ్యులర్ ఏఈవోలు ఉన్నారు, మిగతా 300 పైచిలుకు స్థానాలలో ఖాళీలు ఉండగా ఈ స్థానాల్లో నెలకు కేవలం 15,000 రూపాయల గౌరవభృతితో అవుట్సోర్సింగ్ విధానంలో కాంట్రాక్ట్ ఏఈఓ లను నియమించుకొని వారితో రెగ్యులర్ ఏఈఓ లు చేయాల్సిన అన్ని పనులను వ్యవసాయ శాఖ చేపించుకుంటుంది.
డిజిటల్ పంట సర్వే చేపట్టుటలో ఎదురయ్యే శారీరక శ్రమ, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాలను తెలియజేస్తూనే అరకొర సిబ్బందితో ఒక కోటి 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుచే పంటల వివరాలను హడావిడిగా సర్వే చేపించడం వల్ల వచ్చే డేటా కూడా పూర్తిగా తప్పులతడకగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మారుమూల పంట క్షేత్రాలలో, కొండలు, గుట్టలలో, అడవి భూములలో పంట సర్వే కి ఒంటరిగా వెళ్లిన సందర్భాలలో AEO లు అనుకోని ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలలో రెగ్యులర్ ఏఈఓ ల కుటుంబాలకు ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి, వ్యక్తిగత ప్రమాద భీమా నగదు ఇవ్వడంతో పాటు వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కాంట్రాక్టు విధానంలో నియమితులయ్యే కాంట్రాక్ట్ ఏఈఓ లకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు కూడా లభించవు. రెగ్యులర్ ఏఈవోలు చేయలేని పనిని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బలవంతంగా కాంట్రాక్ట్ ఏఈఓ లతో చేయించే ప్రయత్నాలు మానుకోవాలని గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓ లు జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వ్యవసాయ వృత్తి విద్య కోర్సులు చదువుకొని, నిరుద్యోగం కారణంగా, ఆర్థిక నష్టాల నుండి బయటపడాలనే ఉద్దేశంతో అతి తక్కువ జీవితంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఈఓ లపై ఉన్నతాధికారుల వేధింపు చర్యలను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఏఈఓ లు అల్టిమేట్ జారీ చేశారు. తక్షణమే డిజిటల్ పంట సర్వే మొదలు చేయకపోతే నిర్దాక్షిణ్యంగా వీరిని ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. కాంట్రాక్ట్ ఏఈఓ లకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెగ్యులర్ ఏఈఓ లు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. వీరిపై కక్షపూరిత చర్యలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రెగ్యులర్ ఏఈఓ లు పేర్కొంటున్నారు.
సురేందర్,కాంట్రాక్ట్ aeo
నేను గత 8 నెలలుగా వ్యవసాయ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఏఈఓ గా పనిచేస్తున్నాను. గత నాలుగు నెలలుగా మాకు శాలరీ రావడం లేదు. ఆర్థిక కష్టాల నుండి బయటపడాలనే ఉద్దేశంతో ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్ ఏఈఓ లకు ఉన్నట్టుగా మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, వ్యక్తిగత జీవిత బీమా సదుపాయాలు లేకున్నా ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు, అటవీ భూములలో ఒంటరిగా తిరుగుతూ పంట సర్వే చేయాలని ప్రభుత్వం మా పై ఒత్తిడి తీసుకురావడం బాధాకరంగా ఉంది. మానవతా దృక్పథంతో ఈ డిజిటల్ పంట సర్వే నుండి కాంట్రాక్ట్ ఏఈఓ లను మినహాయించాలి.
హరీష్: రెగ్యులర్ AEO*
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పంట సర్వే కొరకు కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసి క్షేత్రస్థాయిలో ప్రతి 1000 ఎకరాలకు ఒకరి చొప్పున రాష్ట్రంలో కావాల్సినంత మంది తాత్కాలిక సర్వేయర్ లను నియమించుకొని 100% కచ్చితత్వంతో పంటల సర్వే చేపించమని రాష్ట్రాలకు సూచించింది. మన రాష్ట్రం లో కేవలం 2,600 మంది ఏఈఓ లతోనే ఈ సర్వే చేపించాలనుకోవడం అసాధ్యం. డిజిటల్ పంట సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏఈఓ లపై ఒత్తిడి చేయడాన్ని ఆపాలి. తక్షణమే వారికి బకాయి ఉన్న శాలరీ మొత్తాలను విడుదల చేయాలి.