కొనసాగుతున్న ఏఈఓ ల నిరసన జ్వాలలు
ఏఈఓ లపై కక్షా! ?… సాగు వృద్ధికి పరీక్షా ! ?
➡️ గత 45 రోజులుగా కొనసాగుతున్న ఏఈఓ ల నిరసనలు
➡️ రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది పై సస్పెన్షన్ వేటు
➡️ చర్చల పేరిట ఏఈఓ ల సస్పెన్షన్ ఎత్తివేత పై తాత్సారం చేస్తున్న ఉన్నతాధికారులు
➡️ భద్రతా కారణాల దృష్ట్యా సర్వేకు దూరం ఉంటున్నామని మహిళా అధికారుల వెల్లడి
➡️ డిజిటల్ పంట సర్వే నుండి మహిళా ఉద్యోగులను మినహాయించాలని ఉన్నతాధికారులకు వేడుకోలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పంట సర్వే పథకము కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు మధ్య చిచ్చు రగులుతూనే ఉంది. ఎక్కడో గ్రామాలకు దూరంగా అడవులకు దగ్గరగా జనసంచారం లేని ప్రదేశాలలో ఉండే పంట భూములలో మహిళా ఉద్యోగులు ఎటువంటి తోడు లేకుండా ఒంటరిగా తిరుగుతూ ప్రతి గుంట భూమిలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించడంపై ఆ శాఖ ఉన్నతాధికారి పై రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖలో 60% కంటే ఎక్కువగా మహిళా ఏఈఓ లు ఉన్నారని, పంట సర్వేలో భాగంగా తమకు జరగరానిది ఏదైనా జరిగితే తమ కుటుంబాలకు ఉన్నతాధికారులు ఏ విధమైన భరోసా కల్పిస్తారని మహిళా ఉద్యోగులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సదరు ఉన్నతాధికారి నుండి ఎటువంటి హామీ రాకపోవడంతో గత 45 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓ లు శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ సమస్యలను పరిష్కరించకపోగా 58 మంది అధికారులపై సస్పెన్షన్ విధించడాన్ని నిరసిస్తూ ఉన్నతాధికారుల ఈ చర్యను “ఏఈఓ ల పై కక్ష నా ..? లేక రాష్ట్రం లో వ్యవసాయ రంగ వృద్ధి కి పరీక్షా?” అని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. మహిళా ఉద్యోగుల భద్రత పట్ల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి పై రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఏఈఓ లు మంగళవారం రోజున రైతు నేస్తం కార్యక్రమంలో నేల పై కూర్చొని నిరసనలు తెలుపగా పురుష అధికారులు సైతం వారికి మద్దతుగా నేల పై కూర్చొని నిరసనలు తెలియజేశారు. మహిళా అధికారులు భారీ నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా తిరగడం వల్ల తమ మాన ప్రాణాలకు సంభవించే ప్రమాదాల దృష్ట్యా మరియు తమ వ్యక్తిగత భద్రత దృష్ట్యా మాత్రమే తాము డిజిటల్ పంట సర్వే చేపట్టడానికి జంకు తున్నామనీ తెలిపారు. గత ఏడు సంవత్సరాల కాలంలో క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను చిత్తశుద్ధితో అమలుపరిచిన తమ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. గతంలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని కంట్లో కారం కొట్టి గుర్తుతెలియని వ్యక్తి బంగారు నగలు దోచుకు వెళ్లిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రైతు వేదికలలో మహిళా ఉద్యోగుల కాలకృత్యాలకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం పై మహిళా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సుముఖంగా ఉన్నారని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం లో మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు ఈ సందర్భంగా మహిళా ఏఈఓ లు ప్రకటించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించడం తో పాటుగా మహిళా ఏఈఓ ల భద్రత విషయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మహిళా ఏఈఓ లు కోరారు. డిజిటల్ పంట సర్వే చేయడం లేదనే కోపంతో రైతుభీమాను సాకుగా చూపి ఆ కారణంగా సస్పెన్షన్ వేధించిన 58 మంది అధికారులపై ఉన్న సస్పెన్షన్ను భవిష్యత్తుగా ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఏఈవోలు డిమాండ్ చేశారు.
పేరు: క్రాంతి, AEO,నల్గొండ :
రైతు వేదికలలో అటెండర్లు లేకపోవడంతో పరిశుభ్రత పాటించడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి నెల నా జీతం నుండి రూ.5,000 చెల్లిస్తూ ప్రైవేట్ అటెండర్ ను తాత్కాలికంగా నియమించుకొని పనిచేపించుకుంటున్నాము. రైతు వేదికలలో మహిళా అధికారులకు కాల కృత్యాల కొరకు సరైన ఏర్పాట్లు లేకపోవడం తో ఇబ్బండిపడుతున్నాము. డిజిటల్ పంట సర్వే నుండి మహిళ ఏఈఓ లను మినహాయించాలని కోరుతున్నాము
పేరు: నవీన్ , AEO, నాగర్కర్నూల్:
డిజిటల్ పంట సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఈ సర్వే చేపట్టడానికి అధిక మొత్తంలో సిబ్బంది అవసరమవుతారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ మా సమస్యలను పరిష్కరించకుండా కక్షపూరితంగా 58 మంది అధికారులను సస్పెండ్ చేశారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చర్చల పేరుతో కాలయాపన చేయకుండా బేషరతుగా సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలి. సిబ్బందిని ఏర్పాటు చేస్తే సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. డిజిటల్ సర్వే నుండి మహిళ ఏఈఓ లను మినహాయించాలని కోరుతున్నాము.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి